రంజాన్ విశిస్టత మీకు తెలుసా?

‘అల్లాహు అక్బర్ అల్లాహుమ్మ అహిల-హు అలైన బిల్ అమ్ నివల్ ఈమాని, వస్సలామతి వల్ ఇస్లామి వత్తౌపిఖి లిమాను హిబ్బు వతర్ జారబ్బునా వర బ్బుకల్లాహ్’ అల్లాహ్ అందరి కంటే గొప్పవాడు. దేవా! ఈ చంద్రుణ్ణి మా పట్ల శాంతి, విశ్వాసం గల శ్రేయస్కరమైన శాంతి నెలవంకగా ఉదయింపచేయి. నీకు అ భీష్టమైన, ప్రీతికరమైన పనులు చేసేలా మమ్మల్ని కటాక్షించు. ఓ నెలవంకా! నీ దైవం, మా దైవం అల్లాహ్ యే.. ఇస్లామీయ క్యాలెండర్ ప్రకారం షాబాన్ తరువాత వచ్చే రంజాన్ మాసం తొమ్మిదోది. దీని తరువాత షవ్వాల్ మాసం వస్తుంది. షవ్వాల్ నెలవంక దర్శనం వరకు ప్రతిరోజూ ఉపవాస వ్రతాలను శ్రద్ధతో ఆచరిస్తారు.  రంజాన్ నెల అంతా పవిత్ర కార్యక్రమాలతో ముగుస్తూనే షవ్వాల్ నెలవంక ప్రత్యక్షమవుతుంది. ఈ నెలవంక దర్శనమిస్తేనే ముస్లిం సోదరులు ఉపవాసవ్రతాన్ని విరమించి.. మరుసటి రోజు రంజాన్ పండుగను అత్యంత భక్తిశ్రద్ధలతో సంతోషాలతో జరుపుకుంటారు. షవ్వాల్ నెల మొదటి రోజున జరుపుకునే ఈ రంజాన్ పండుగను ఈదుల్ ఫితర్ అంటారు. నెల పొడుపుతో రంజాన్ ఉపవాస దీక్షలు విరమించి మరుసటి దినాన్ని రంజాన్ పండుగగా నిర్ణయిస్తారు. అల్లా రక్షణ, కరుణ అందరూ పొందాలన్న ఆశయంతో ఈద్గాలో బారులుతీరి పండుగ నమాజు చేస్తారు. కొత్త వస్త్రాలు, పరిమళ ద్రవ్యాలతో వాతావరణమంతా ఆహ్లాదకరమవుతుంది. ధనిక, బీద తారతమ్యంలేక, సహృదయాలతో సద్భావనలతో ఆలింగనం చేసుకుంటారు. ద్వేషాలన్నీ సమసి ప్రేమపూరిత భావం ఇనుమడిస్తుంది. ప్రత్యేకంగా సేమ్యాతో చేసిన ఖీర్ తినిపించుకొని  ముస్లిమేతర సోదరులు కూడా కలిసి శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు.

మతసామరస్యానికి, భక్తిభావానికి ప్రఖ్యాతిగాంచిన విశిష్టమైన పండుగ పవిత్ర రంజాన్. ప్రపంచవ్యాప్తంగా నూట ఇరవై కోట్లకు పైగా ముస్లింలు సంప్రదాయబద్ధంగా రంజాన్ ఆచరిస్తారు. అరబిక్ భాషలో రమ్జ్ అంటే ఆగడం అని అర్థం. ఈ మాసంలోని నెలరోజుల్లో ఉపవాస దీక్షలో శరీరాన్ని శుష్కింప చేయడం ద్వారా ఆత్మప్రక్షాళన అవుతుంది. తద్వారా సర్వపాపాలు సమసిపోతాయి. అరిషడ్వర్గాలైన కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అదుపులోకి వచ్చి మనోనిగ్రహం ఏర్పడుతుంది. మానవుల్లో ప్రేమాభిమానాలు, క్రమశిక్షణ, కర్తవ్య పరాయణత్వం, సహనం, దాతృత్వం, పవిత్ర జీవనం, న్యాయమార్గానుసరణం, ఆర్థిక సమానత్వం, సర్వమానవ సౌభ్రాతృత్వం మొదలైన ఉత్తమ గుణాలు మానవులకు అలవాటు చేసేందుకు సర్వశక్తియుతుడు, సర్వవ్యాపి, సర్వసాక్షి అయిన అల్లాహ్ ప్రతి ఏడాది మానవ జాతికి రంజాన్ మాసాన్ని ప్రసాదించాడు. మానవుల మధ్య నెలకొన్న వర్గ వైషమ్యాలు తొలగించి అందరిలో ఆధ్యాత్మిక చింతన కలిగించి చిరుజీవితాన్ని ఆనందంతో నింపి పుణ్యకార్యాల వైపు దృష్టి మరల్చే రంజాన్ మాసం చైతన్యాన్ని కలిగించి ముందుకు సాగే ధైర్యాన్నిస్తుంది.

పండుగ నాడు ఇలా చేద్దాం..
పండుగ నాడు గుసుల్ అంటే.. అభ్యంగన స్నానం చేయాలి. మిస్వాక్ ఉపయోగించాలి. గోళ్లను కత్తిరించుకోవాలి. కొత్త వస్త్రాలు ధరించాలి. ఈదుల్ ఫితర్ నమాజుకు ముందు కొన్ని ఖర్జూరపు పళ్లు తిని వెళ్లాలి. ఈద్ నమాజ్ ఈద్గాహ్‌లో మాత్రమే చేయాలి. ఈద్గాహ్‌కు సాధ్యమైనంత వరకు నడకతోనే పోవాలి. వెళ్లేప్పుడు ఒక మార్గం నుంచి వచ్చేటప్పుడు మరో మార్గం నుంచి రావాలి. సదకా గాని, ఫిత్రా కాని నమాజుకు ముందే దానంచేయాలి. నమాజుకు వెళ్లే సమయంలో ఈ తక్బీద్ చదువుకుంటూ, ‘‘అల్లాహ్ అక్బర్, అల్లాహు లాయిలాహ ఇల్లల్లాహు అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ వలిల్లా హిల్ హిమ్ద్’’ వెళ్లాలి. పండుగ నాడు ఆనందోత్సాహాలతో ఉల్లాసంగా సంతోషంగా గడపాలి.

Total Views: 156 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

వైసీపీలోకి జయప్రద?

ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రద వైసీపీలో చేరబోతున్నారా? త్వరలోనే