‘ఫిదా’ మూవీ రివ్యూ

శేఖర్ కమ్ముల సినిమాలంటే యూత్ ని ఎంతగా ఆకట్టుకుంటాయే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎటువంటి స్టార్స్ లేకుండా పూర్తిగా కొత్త వాళ్ళతో సినిమాను తెరకెక్కించి హిట్ కొట్టగలిగే సత్తా ఉన్న దర్శకుడు. అలాంటిది ఒక స్టార్ హీరోతో తెరకెక్కిస్తే సినిమా ఎలా ఉంటుందో అని ప్రతి ఒక్కరు అనుకుంటుండాగా.. వరుణ్ తో ఫిదా సినిమాను తెరకెక్కించాడు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలే అలుముకున్నాయి. ముఖ్యంగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని తెరకెక్కించడం మరింత ఆసక్తిని రేపింది. మ‌రి అందుకు త‌గ్గ‌ట్టుగానే సినిమా ఉందా? వ‌రుణ్‌తేజ్‌, సాయిప‌ల్ల‌వి జోడీ ప్రేక్ష‌కుల్ని ఫిదా చేసిందా లేదా?

కథ :
వ‌రుణ్ (వ‌రుణ్‌తేజ్‌) అమెరికాలో ఓ డాక్ట‌ర్‌. త‌న అన్న‌య్య, త‌మ్ముడితో క‌లిసి నివ‌సిస్తుంటాడు. అన్న‌య్య పెళ్లిచూపుల కోస‌మ‌ని వ‌రుణ్ బాన్సువాడ రావాల్సి వ‌స్తుంది. వ‌చ్చాక పెళ్లి నిశ్చ‌య‌మ‌వుతుంది. ఆ ఇంట్లోనే ఉన్న పెళ్లికూతురు చెల్లెలు భానుమతి (సాయిప‌ల్ల‌వి)ని చూసి ఇష్ట‌ప‌డ‌తాడు. ఆమె కూడా వ‌రుణ్‌ని ఇష్ట‌ప‌డుతుంది. అయితే భానుమతికి త‌న ఊర‌న్నా, త‌న ఇల్లన్నా చాలా ఇష్టం. త‌న‌దైన ప్ర‌పంచంలో ఉండ‌టానికే ఇష్ట‌ప‌డుతుంది. కానీ వరుణ్ ఉద్దేశాలు వేరు. కెరీర్‌, అమెరికా అంటూ ఆలోచిస్తుంటాడు. ఇంత‌లోనే చిన్న చిన్న మ‌న‌స్ప‌ర్థ‌లు. దాంతో వ‌రుణ్‌కి దూరంగా ఉండాల‌నుకొంటుంది భానుమ‌తి. ఊళ్లోనే త‌న త‌ల్లిదండ్రులు చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాల‌ని కూడా నిర్ణ‌యించుకొంటుంది. వ‌రుణ్ కూడా భానుమతికి దూరంగా ఉండాల‌నుకొంటాడు. మ‌రి అది సాధ్య‌మైందా? లేదా? భానుమతి పెళ్లి ఎవ‌రితో ఎలా జ‌రిగింది? త‌దిత‌ర విష‌యాల్ని తెర‌పైనే చూడాలి.

విశ్లేష‌ణ‌:
తెలంగాణ ప్రాంతానికి చెందిన అమ్మాయి, అమెరికాలో ఉండే అబ్బాయికి మధ్య జరిగే కథే ‘ఫిదా’. ఇద్దరు వేర్వేరు అభిరుచులు గల వ్యక్తులు ఎలా ప్రేమలో పడతారు..? ఆ ప్రేమ కోసం వారు ఎలాంటి తపన పడతారు..? అనే పాయింట్స్ ను తెరపై చాలా అందంగా చూపించారు దర్శకుడు శేఖర్ కమ్ముల. చాలా కాలం తరువాత ఓ మంచి అందమైన, ఆహ్లాదకరమైన ప్రేమ కథను తెరపై చూస్తున్నామనే భావన ప్రతి ఒక్కరిలో కలుగుతుంది.

కేవలం యూత్ కు మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా సినిమా చేయడంలో దర్శకుడు శేఖర్ కమ్ముల సక్సెస్ అయ్యాడు. భార్యభర్తల మధ్య రిలేషన్, తండ్రికూతుళ్ళ మధ్య బంధం, ప్రేమించే అమ్మాయి పట్ల అబ్బాయికి ఉండే ప్రేమ ఇలా ప్రతి ఒక్క రిలేషన్ ను మనసుకు హత్తుకునే విధంగా చూపించారు. ప్రతి ఫ్రేమ్ కూడా అందంగా ఉంది. భాన్సువాడ ప్రాంతపు అందాల్ని బాగా చిత్రీకరించారు.

ఈ సినిమా పెద్ద హైలైట్ హీరోయిన్ సాయి పల్లవి.. తన నటనతో అందరినీ మెప్పించింది. ముఖ్యంగా తెలంగాణ యాసలో ఆమె చెప్పే డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. తెలుగులో మొదటి సినిమా అయినా.. డబ్బింగ్ చాలా బాగా చెప్పింది. ప్రేక్షకుల దృష్టి ఆమె నుండి మరొకరి వైపు మళ్లకుండా చేసుకుంది. వరుణ్ తేజ్ తన పాత్రలో బాగానే నటించాడు. కొన్ని చోట్ల హావభావాల విషయంలో తడబడ్డాడు. అయినప్పటికీ ఓవరాల్ గా బాగానే మ్యానేజ్ చేశాడు. ఒకరకంగా సాయి పల్లవి, వరుణ్ తేజ్ ను డామినేట్ చేసిందనే చెప్పాలి. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు, సంభాషణలు ఆకట్టుకుంటాయి. హీరోయిన్ తండ్రి పాత్రలో నటుడు సాయి చంద్ జీవించేశాడు. రాజా, సత్యం రాజేష్ ఇలా ప్రతి ఒక్కరూ తమ పాత్రకు పూర్తి న్యాయం చేశారు.

టెక్నికల్ సినిమా విలువలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ వర్క్ చాలా అందంగా, ఆకట్టుకునే విధంగా ఉంది. సంగీతం సినిమాకు మరో ప్లస్. ప్రతి పాట సందర్భానుసారంగా ఉంది. సెకండ్ హాఫ్ లో స్క్రీన్ ప్లే ఇంకాస్త ఫాస్ట్ గా ఉండే సినిమా ఇంకా బావుండేది. ఎడిటింగ్ వర్క్ బావుంది. నిర్మాణ విలువలు కథకు తగ్గట్లుగా ఉన్నాయి. మొత్తానికి ఫిదా అంటూ చాలా గ్యాప్ తరువాత వచ్చిన శేఖర్ కమ్ముల తనదైన మార్క్ తో ఆకట్టుకున్నాడు.

రేటింగ్ : 3.0

Total Views: 1811 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

‘సవ్యసాచి’ సింపుల్ రివ్యూ

నాగ చైతన్య ,నిధి అగర్వాల్ జంటగా చందూ మొండేటి తెరకెక్కించిన