ద్రవిడ సూరీడు, కళావల్లభుడు కరుణానిధి జీవిత విశేషాలు!

వా వా తలైవా అంటూ 11 రోజులుగా అభిమానుల నినాదాలతో మారుమ్రోగిన తమిళనాడు శోక సంద్రంలో మునిగిపోయింది. తన 94 ఏళ్ళ సుదీర్ఘ ప్రస్థానానికి సెలవు పలికి దిగంతాలకు ఏగిపోయారు తెలుగు దిగ్గజం, ద్రావిడ సూరీడు కరుణానిధి. ఆయన జీవిత ప్రస్థానం పూలబాటే కాదు రాళ్లు, ముల్లబాటలు కూడా ఉన్నాయి.

కరుడుగట్టిన తమిళ రాజకీయవాదిగా, తమిళ ఉద్యమకారుడిగా పేరుగాంచిన కరుణానిధి తెలుగింటి బిడ్డ. ఆయన అసలు పేరు దక్షిణామూర్తి. 1924 జూన్‌ 3న తంజావూరు  జిల్లా తిరుక్కువలై గ్రామంలో ముత్తువేల్‌, అంజుగం దంపతులకు జన్మించిన కరుణానిధి పూర్వీకులది ప్రకాశం జిల్లా. కరుణకు షణ్ముగసుందరాంబాళ్‌, పెరియనాయమ్మాళ్‌ అనే చెల్లెళ్లు ఉండేవారు. నాదస్వర వాద్యకారుల కుుటుంబంలో జన్మించిన కరుణ.. 8వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నారు. ఆది నుంచి ఆయనకు ఉద్యమాలన్నా, సాహిత్యమన్నా ఎనలేని మక్కువ. మూఢ విశ్వాసాల గురించి, తనకు తెలిసిన ప్రపంచం గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఆయన చిన్ననాటి నుంచే రకరకాల నాటికలు రచించేవారు. తన స్నేహితులతో కలిసి నటించేవారు కూడా. తనకు అర్థమైన పద్ధతుల్లో హేతువాదానికి మద్దతుగా అభ్యుదయ రచనా వ్యాసంగం సాగించేవారు.

రాజకీయాల్లోకి రాకముందు కరుణానిది తమిళ సినీరంగంలో సిద్ధహస్తుడైన రచయితగా కొనసాగారు. అద్భుతమైన కథలు, నాటికలు, నవలలు రచించడం ద్వారా.. తమిళ సాహిత్య రంగానికీ తనవంతు సేవలు అందించారు. కరుణానిధి 1947లో రాజకుమారి అనే సినిమా ద్వారా తమిళ పరిశ్రమకు రచయితగా పరిచయం అయ్యారు. ఈ సినిమా సమయంలోనే కరుణానిధికి ఎంజీరామచంద్రన్‌ పరిచయమయ్యారు. అభిమన్యు, మరుదనాట్టు ఇళవరసి లాంటి ఎంజీఆర్‌ సినిమాలెన్నింటికో కరుణానిధి రచన అందించారు. కరుణానిధి సినీజీవితంలో చెరగని యశస్సును అందించిన సినిమాగా పరాశక్తిని చెప్పుకోవాలి. ద్రవిడ ఉద్యమ స్పూర్తిని రగిలించడమే కాదు.. బ్రాహ్మణవాదంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన ఈ సినిమా అప్పట్లో ఓ ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచింది. కరుణానిధి 2011 వరకూ తన రచనా వ్యాసంగాన్ని కొనసాగించారు. చారిత్రక చిత్రం పొన్నార్‌ శంకర్‌కు ఆయన చివరిసారిగా రచనను అందించారు. కరుణానిధి తమిళ సాహిత్యానికీ కరుణానిధి ఇతోధిక సేవను అందించారు.

కరుణానిధి సంప్రదాయాలకు పూర్తిగా వ్యతిరేకి అనే ఆరోపణలున్నాయి. వీటిలో ఎంతవరకూ నిజముందో లేదో గానీ… పెళ్లికి గుర్తుగా నిలిచే తాళిబొట్టు కట్టాలన్న కారణంగా కరుణానిధి తన ప్రేమికురాలితో పెళ్లికి నిరాకరించారట! చెన్నైకి చెందిన ప్రముఖ జర్నలిస్టు ఆర్ నూర్ అల్లా వెల్లడించిన వివరాల ప్రకారం కరుణానిధి సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకోవడాన్ని ఇష్టపడేవారు కాదట. ఈ కారణంగానే ఆయన తన ప్రేమికురాలిని వివాహం చేసుకోలేదని నూర్ తెలిపారు. 1944లో కరుణానిధి ప్రియురాలి కుటుంబ సభ్యులు వారి పెళ్లికి అంగీకరిస్తూ సంప్రదాయబద్ధంగా వివాహం చేయాలనుకున్నారట! అయితే దీనిని కరుణానిధి నిరాకరించారట! తనకు మంగళ సూత్రమన్నా, మంత్రోచ్ఛారణలన్నా పడవని వారితో తెగేసి చెప్పేశారట! ఈ కారణంగానే వారి పెళ్లి జరగలేదని నూర్ తెలిపారు. ఈ ఘటనతో ఆవేదన చెందిన కరుణ ప్రియురాలు కూడా మరో వివాహం కూడా చేసుకోలేదట! ఆచారాలను వ్యతిరేకించే కరుణానిధి జీవితంలో ఇటువంటి ఘటనలు అనేకం ఉన్నాయని నూర్ తెలిపారు. కాగా కరుణానిధికి ముగ్గురు భార్యలు. పెద్ద భార్య ‘పద్మావతి’ కన్నుమూశారు. రెండవ భార్య దయాలూ అమ్మ, మూడవ భార్య రాజథీ అమ్మ ఉన్నారు.

కరుణానిధి రాజకీయ ప్రస్థానం పూలబాటగానే కాదు. రాళ్లు.. ముళ్లబాటలుగానూ సాగింది. కరుణానిధి ఎంతటి వ్యూహకర్త అయినా.. బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం కారణంగా.. వివాదాల్లో ఇరుక్కున్నారు. అవినీతి ఆరోపణలపై జైలుకూ వెళ్లారు. అదే బాటలో.. కుమార్తె కనిమొళి కూడా అవినీతి ఆరోపణలతోనే జైలుపాలయ్యారు. వీరాణం ప్రాజెక్టుకు టెండర్లు కట్టబెట్టడంలో అవినీతికి పాల్పడ్డారంటూ.. కరుణ ప్రభుత్వాన్ని సర్కారియా కమిషన్‌ తప్పుబట్టింది. ఇందిరాగాంధీ.. కరుణానిధి ప్రభుత్వాన్ని ఇదే కారణంతో బర్త్‌రఫ్‌ చేసింది. 2001లో ఫ్లైఓవర్ల కుంభకోణంలో కరుణానిధి అరెస్ట్‌ కూడా అయ్యారు.

ద్రవిడ ఆత్మాభిమాన ఉద్యమం.. రాజకీయ యవనికపై ఆవిష్కరించిన దురంధరుడు కరుణానిధి. ద్రవిడ మున్నేట్ర కళ్జగం పేరిట స్థాపించిన పార్టీకి ఆయన అచ్చంగా పదిసార్లు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. కరుణానిధి, తన 33వ ఏట.. 1957లో కుళితలై స్థానం నుంచి తొలిసారిగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1961లో డిఎంకె కోశాధికారిగాను, అసెంబ్లీలో పార్టీ డిప్యూటీ లీడర్‌గాను ఎన్నికయ్యారు. 1967లో డిఎంకె అధికారంలోకి రాగానే కరుణానిధి పబ్లిక్‌ వర్క్స్‌ మంత్రిగా నియమితులయ్యారు.

రాజకీయ రంగంలో అంచెలంచెలుగా ఎదిగిన కరుణానిధి 1969లో అన్నాదురై మరణించడంతో.. రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కరుణానిధి తన కెరీర్‌లో మొత్తం మీద 13సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1969 నుంచి 2011 మధ్య కాలంలో ఐదుసార్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఎమర్జెన్సీ సమయంలో కరుణానిధి ఇందిరాగాంధీ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఫలితంగా ఆయన పార్టీ నాయకులు చాలామంది అరెస్టయ్యారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కరుణానిధి జనతాపార్టీతో కలిసి వెళ్లి ఓటమిపాలయ్యారు.

బంధుప్రీతి అంశంపైనా కరుణానిధి వివాదంలో కూరుకుపోయారు. తనయులు స్టాలిన్‌, అళగిరి, కనిమొళిలపైనా అవినీతి ఆరోపణలు వచ్చాయి. కనిమొళి కూడా అవినీతి ఆరోపణలపై జైలుజీవితం గడిపారు. కొంతకాలం క్రితమే ఆమె విడుదలయ్యారు. ఇక రాజీవ్‌గాంధీ హత్య కేసును విచారించిన జస్టిస్‌ జైన్‌ కమిషన్‌.. కరుణానిధి ఎల్టీటీయీకి మద్దతునివ్వడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. తమిళ ఈలం నేత ప్రభాకరణ్ తనకు మంచి స్నేహితుడని కరుణానిధి కూడా ఓ సందర్భంలో వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది. సేతుసముద్రం వివాదంలో రాముడి అస్తిత్వాన్ని ప్రశ్నిస్తూ కరుణానిధి చేసిన వ్యాఖ్యలు కూడా పెను కలకలాన్నే సృష్టించాయి.

ద్రవిడ ఉద్యమ స్ఫూర్తితో ఏర్పాటైన ద్రవిడ మున్నేట్ర కళ్జగం పార్టీ చీలిక కరుణానిధి హయాంలోనే జరిగింది. పార్టీ కార్యదర్శిగా ఉన్న కరుణానిధి.. సినీ, రాజకీయ సన్నిహితుడు ఎంజీరామచంద్రన్‌ను.. వివిధ కారణాల వల్ల.. పార్టీ నుంచి బహిష్కరించారు. దీంతో.. ఎంజీఆర్‌ అన్నాడిఎంకె పార్టీని స్థాపించారు. ఆటుపోట్ల అనంతరం ఎంజీఆర్‌ అధికారపీఠాన్ని దక్కించుకోగలిగారు. అప్పటి నుంచి రాష్ట్రంలో డిఎంకె, అన్నాడిఎంకెలు చెరో టర్మ్‌ గెలవడం ఆనవాయితీగా కొనసాగింది. 2013లో ఆ ఆనవాయితీని తమిళ ఓటర్లు తిరగరాస్తూ.. జయలలితకు వరుసగా రెండోసారి పట్టం కట్టారు. అలా.. ఈసారి కరుణానిధి అధికారానికి దూరమయ్యారు. మాజీ ముఖ్యమంత్రిగానే కన్నుమూశారు.

Total Views: 128 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

వైసీపీలోకి జయప్రద?

ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రద వైసీపీలో చేరబోతున్నారా? త్వరలోనే