గీతం యూనివర్శిటీ వ్యవస్థాపకులు ఎంవీవీఎస్ మూర్తి మృతి తెలుగు ప్రజల్లో విషాదం నింపింది. విద్యా రంగానికి ఆయన చేసిన సేవలను ప్రజలు స్మరించుకుంటున్నారు. ఎంవీవీఎస్ అసలు పేరు మతుకుమిల్లి వీర వెంకట సత్యనారాయణమూర్తి. గతంలో తెలుగు ప్రజలకు సుపరిచితమైన గోల్డ్‌స్పాట్ కూల్‌డ్రింక్ సంస్థను స్థాపించింది ఆయనే. ఆ కూల్‌డ్రింక్ ఫేమస్ కావడంతో ఆయన గోల్డ్‌స్పాట్ మూర్తిగా ప్రసిద్ధిచెందారు.
గాంధీజీ ఆశయాలు అంటే ఎంవీవీఎస్ మూర్తికి ఆదర్శం, అభిమానం. అందుకే గాంధీజీ పేరిట గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్(GITAM) ఇంజనీరింగ్ కాలేజీని ప్రారంభించారు. ఆ సంస్థను ఉన్నత ప్రమాణాలతో నిర్వహిస్తూ డీమ్డ్ యూనివర్సిటీ స్థాయికి తీసుకువెళ్ళారు. మూర్తి స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి మండలం మూలపొలం. వ్యాపార రీత్యా విశాఖకు నాలుగున్నర దశాబ్ధాల క్రితం వెళ్ళారు. విశాఖ జిల్లా తెలుగుదేశం నాయకత్వాన్ని చాలా కాలం ఆయనే నడిపించారు. ఎన్టీఆర్‌కు, ఆ తర్వాత చంద్రబాబుకు సన్నిహితంగా మెలిగారు.
ఎన్టీఆర్ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చిన మూర్తి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు. తెదేపా నుంచి తొలిసారి 1989లో విశాఖపట్నం నుంచి లోక్‌సభకు పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం 1991లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌కు చెందిన ఉమా గజపతిరాజుపై గెలుపొందారు. 1999లోనూ మరోసారి అదే నియోజకవర్గం నుంచి గెలుపొందారు. తరువాత 2004 ఎన్నికల్లో నేదురుమల్లి జనార్దన్‌రెడ్డిపై ఓడిపోయారు. 2009 ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. 2014 ఎన్నికల్లో విశాఖపట్నం సీటును పొత్తులో భాగంగా భాజపాకు కేటాయించడంతో పోటీ చేయలేకపోయారు. అయితే మూర్తి సేవలను గుర్తించిన పార్టీ అధినేత చంద్రబాబు ఆయన్ని ఎమ్మెల్సీగా నామినేట్ చేశారు. రాష్ట్రంలో అనేక మంది రాజకీయ ప్రముఖులతో ఆయనకు స్నేహబంధాలున్నాయి. మూర్తి ఆకస్మిక మృతి పట్ల పలువురు దిగ్భ్రాంతి చెందారు.