రారండోయ్.. వేడుక చూద్దాం రివ్యూ

నటుడిగా తన రీచ్ ను మరింత పెంచుకోవడానికి నాగచైతన్య ఎన్నుకున్న సినిమా ‘రా రండోయ్ వేడుక చూద్దాం’. ఈ సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేసిన చైతు ఎంతవరకు సక్సెస్ ను అందుకున్నాడో.. సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం!

కథ:
భ్రమరాంబ(రకుల్ ప్రీత్ సింగ్)ను చిన్నప్పటినుండి ఎంతో గారంబంగా పెంచుతారు. కుటుంబం తప్ప మరో విషయం తెలియని భ్రమరాంబను ఓ పెళ్ళిలో చూసి ప్రేమిస్తాడు శివ(నాగచైతన్య). కానీ భ్రమరాంబ మాత్రం ఇంట్లో చూపించిన వారినే పెళ్లి చేసుకుందామని ముందే నిర్ణయించుకుంటుంది. చదువు కోసం వైజాగ్ వెళ్ళిన భ్రమరాంబ, శివకు దగ్గరవుతుంది. సిటీకి కొత్త కావడంతో ప్రతి విషయానికి ఆమె పక్కన శివ ఉండాల్సిందే. అయితే శివ కుటుంబానికి భ్రమరాంబ కుటుంబానికి మధ్య పాత గొడవలు ఉంటాయి. ఈ విషయం తెలియక శివ, భ్రమరాంబను ప్రాణంగా ప్రేమిస్తాడు. ఒకానొక సమయంలో భ్రమరాంబ కూడా శివను ఇష్టపడుతుంది. మరి వీరి ప్రేమను ఇరు కుటుంబాలు అంగీకరించాయా..? అసలు వారి మధ్య ఉన్న గొడవలు ఏంటి..? పెద్దల పగల కారణంగా ప్రేమజంట మధ్యలో నలిగిపోతుందా..? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

నటీనటులు :
ప్రేమమ్, సాహసం శ్వాసగా సాగిపో సినిమాలతో మాస్ ఆడియన్స్ కు దగ్గరైన నాగచైతన్య మరోసారి తన మార్క్ ఫ్యామిలీ రొమాంటిక్ డ్రామాతో మెప్పించాడు. నటుడిగానూ మంచి పరిణతి కనబరిచాడు. ముఖ్యంగా భ్రమరాంబతో విడిపోయే సన్నివేశాల్లో నాగచైతన్య నటన ఆకట్టుకుంటుంది. భ్రమరాంబగా రకుల్ ప్రీత్ సింగ్ సూపర్బ్ గా ఉంది. హీరో నాగచైతన్యే అయినా కథ అంతా రకుల్ క్యారెక్టర్ చుట్టూ తిరుగుతుంది. లుక్స్ పరంగా పల్లెటూరి అమ్మాయిగా అమాయకంగా కనిపిస్తూనే ఎమోషనల్ సీన్స్ లో కంటతడి పెట్టించింది. తండ్రి పాత్రలో జగపతి బాబు, సంపత్ లు మరోసారి తమ మార్క్ చూపించారు. వెన్నెల కిశోర్ కామెడీతో అలరించాడు.

విశ్లేషణ:

సినిమా అంతా కలర్‌ఫుల్‌గా తీర్చిదిద్దాడు దర్శకుడు కల్యాణ్‌ కృష్ణ కురసాల. కుటుంబ వాతావరణం.. పల్లెటూరు అందాలతో ప్రతి ఫ్రేమ్‌ను చాలా అందంగా చూపించాడు. ఇటీవల ఈ సినిమా గురించి నాగార్జున మాట్లాడుతూ ‘నిన్నే పెళ్లాడుతా’తో పోల్చిన విషయం తెలిసిందే. ఆయన అన్నట్లే ఈ సినిమా చూస్తుంటే కృష్ణవంశీ సినిమా చూశామన్న ఫీలింగ్‌ కలుగుతుంది.

కథలో కీలక మలుపులు లేకపోయినా పాత్రల చిత్రీకరణ ఆకట్టుకుంటుంది. ప్రథమార్థంలో భ్రమరాంబను ప్రధానంగా చూపించారు. శివ – భ్రమరాంబల మధ్య సన్నివేశాలు చాలా సరదాగా.. ఆహ్లాదకరంగా సాగుతాయి. వెన్నెల కిషోర్‌ కామెడీ మరో ప్రధానాకర్షణగా నిలుస్తుంది. తొలి అర్ధభాగంలో ఉన్న రెండు పాటలు.. చిత్రీకరించిన విధానం బాగుంది.

మొదటి అర్ధభాగంలో వినోదానికి, ప్రేమ సన్నివేశాలకి, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ పాత్ర చిత్రీకరణకు ప్రాధాన్యత ఇచ్చిన దర్శకుడు ద్వితీయార్థంలో ఎమోషనల్‌ సన్నివేశాలకు పెద్దపీట వేశాడు. అటు తండ్రి, ఇటు ప్రేమించిన వ్యక్తి మధ్య సంఘర్షణకు గురైన ఓ అమ్మాయి కథను దర్శకుడు చూపించే ప్రయత్నం చేశాడు. తొలి భాగంతో పోలిస్తే ద్వితీయార్ధంతో వినోదం తగ్గింది. అయినప్పటికీ ఫ్యామిలీ ఎమోషన్స్‌ పండటంతో సన్నివేశాలన్నీ సాఫీగా సాగిపోయినట్లు అనిపిస్తాయి. ముందుగా చెప్పినట్టు కథలో పెద్దగా మలుపుల్లేవు. ప్రతి సన్నివేశం ప్రేక్షకుడి వూహకు తగినట్లే సాగుతుంది.

పతాక సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. మాస్‌ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని యాక్షన్‌ సన్నివేశాల్ని దర్శకుడు ఇరికించినట్టు అనిపిస్తుంది. నాగ చైతన్య, జగపతిబాబు, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ మధ్య వచ్చే సన్నివేశాలపైనే దర్శకుడు దృష్టి పెట్టిన దర్శకుడు మిగతా విషయాలను కాస్త పట్టించుకుని ఉంటే ఇంకా బాగుండేది.

దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం కథలో ఇమిడిపోయింది. ప్రతి సన్నివేశాన్ని రంగుల హరివిల్లుగా చూపించారు ఛాయాగ్రాహకుడు. సన్నివేశాల్ని అందంగా రాసుకున్న దర్శకుడు కథను కూడా దృష్టిలో పెట్టుకుంటే ఆ సన్నివేశాలకు మరింత బలం చేకూరేది.

రేటింగ్ : 2.5

(Satish K.S.R.K)

Total Views: 8332 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

సినిమాలకు సమంత గుడ్‌ బై!

వరుస సూపర్ హిట్స్ తో మంచి క్రేజ్ లో ఉన్న