‘ఒక్కడు మిగిలాడు’ మూవీ రివ్యూ

వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ వెండితెరపై తనదైన ముద్రవేసిన యువ కథానాయకుడు మంచుమనోజ్‌.మరో ఆసక్తికరమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శ్రీలంక శరణార్థుల నేపథ్యంలో తెరకెక్కిన ఒక్కడు మిగిలాడు సినిమాలో రెండు విభిన్న పాత్రలో నటించిన మనోజ్‌ ఆకట్టుకున్నాడా..? నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాతో కమర్షియల్‌ సక్సెస్‌ సాదించాడా..?

కథ :
యూనివ‌ర్సిటీ ప్రొఫెస‌ర్(సూర్య‌) త‌న ప్ర‌మోష‌న్ కోసం త‌న ముగ్గురు కాలేజ్ స్టూడెంట్స్‌ను మినిష్ట‌ర్ కొడుకులకు అప్ప‌గిస్తాడు. మినిష్ట‌ర్ (మిలింద్ గునాజి) కొడుకులు ఆ అమ్మాయిల‌ను చంపేస్తారు. చ‌నిపోయింది యూనివ‌ర్సిటీ అమ్మాయిలే కాకుండా శ‌ర‌ణార్థులు కూడా కావ‌డంతో స్టూడెంట్స్ అంద‌రూ ఏక‌మ‌వుతారు. విద్యార్థి నాయ‌కుడు సూర్య‌(మ‌నోజ్‌) ఆధ్వ‌ర్యంలో మినిష్ట‌ర్‌కు వ్య‌తిరేకంగా పోరాటం సాగిస్తారు. మినిష్ట‌ర్ త‌న ప‌లుకుబ‌డిని ఉప‌యోగించి సూర్య‌ను ఆరెస్ట్ చేయిస్తాడు. త‌న‌ను చంప‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తుంటాడు. ఆస‌మ‌యంలో సూర్య ఉండే పోలీస్ స్టేష‌న్‌కు వ‌చ్చిన కొత్త కానిస్టేబుల్ శివాజీ(పోసాని కృష్ణ‌ముర‌ళి)..సూర్య‌కు స‌హాయం చేయాల‌నుకుని త‌న గురించి తెలుసుకునే ప్ర‌య‌త్నం చేస్తాడు. అస‌లు సూర్య ఎక్క‌డి నుండి వ‌చ్చాడు అనే పాయింట్‌తో అస‌లు క‌థ మొద‌ల‌వుతుంది. సూర్య ఎవ‌రు? సూర్య‌, పీట‌ర్‌కు సంబంధం ఏమిటి? విక్ట‌ర్ ఎవ‌రు? విక్ట‌ర్‌, సూర్యకు సంబంధం ఏమిటి? అనే విష‌యాల‌ను తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేష‌ణ‌:

దేశ విభజన సమయంలో తమిళనాడు నుంచి శ్రీలంకకు వలసపోయిన శరణార్థులు తమ జాతి మనుగడ కోసం ఎలా పోరాటం సాగించారన్న కథను తీసుకొని ‘ఒక్కడు మిగిలాడు’ను తీర్చిదిద్దారు. 2017లో జరిగిన కథకు పాతికేళ్ల క్రితం శ్రీలంకలో జరిగిన ఉద్యమానికి ముడిపెట్టిన విధానం బాగుంది. శరణార్థుల చరిత్ర మరీ ముఖ్యంగా ఎల్‌టీటీఈ అంశంపై అవగాహన ఉన్నవాళ్లు ఈ కథకు త్వరగా కనెక్ట్‌ అవుతారు. ఫ్లాష్‌ బ్యాక్‌లో సాగే యుద్ధ సన్నివేశాలు ఈ కథకు బలం. విశ్రాంతికి 20 నిమిషాల ముందు పీటర్‌(మనోజ్‌) పాత్ర కథలో ప్రవేశిస్తుంది. పీటర్‌ ఉన్నంతవరకూ ఈ సినిమా ఓ ఎమోషనల్‌ రైడ్‌గా సాగుతుంది. శ్రీలంకలోని శరణార్థుల కష్టాలు, వారి కన్నీటి గాథ, పౌరసత్వం కోసం వారు చేసే ప్రయత్నాలు తదితర అంశాలను దర్శకుడు చక్కగా మలుచుకున్నాడు. ద్వితీయార్ధంలో దాదాపు 40 నిమిషాలపాటు పడవ ప్రయాణానికి సంబంధించిన సన్నివేశాలు ఉన్నాయి. శరణార్థులు శ్రీలంక విడిచి భారతదేశంలో ఎలా అడుగు పెట్టారు? అనే విషయాన్ని చెప్పాలనుకున్న దర్శకుడు ఏకంగా 40 నిమిషాల సమయం తీసుకున్నాడు. ఆ సన్నివేశాలన్నీ ఒకింత సహనాన్ని పరీక్షిస్తాయి. రెండు, మూడు నిమిషాల్లో చెప్పాల్సిన సన్నివేశాలను సుదీర్ఘంగా మలచడంతో అక్కడే సినిమా కాస్త పట్టు తప్పినట్లు అనిపిస్తుంది. పతాక సన్నివేశాల్లో మనోజ్‌ చెప్పిన సంభాషణలు ఆలోచింపజేస్తాయి. పడవ ప్రయాణం ఎపిసోడ్‌ స్థానంలో మరో బలమైన ఎమోషన్‌ని చెప్పగలిగి ఉంటే బాగుండేది. సన్నివేశాలన్నీ సహజంగా కళ్లకు కట్టినట్టు చూపించాడు దర్శకుడు. కాకపోతే హింస, రక్తపాతం ఎక్కువగా కనిపిస్తాయి. ఒక‌ట్రెండు సంభాషణలను మ్యూట్‌ చేశారు కూడా.

ఇప్పటికే నటుడిగా ప్రూవ్‌ చేసుకున్న మంచు మనోజ్‌ ఈ సినిమాతో మరోసారి ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. విద్యార్థి నాయకుడిగా మనోజ్‌ నటన చాలా సహజంగా అనిపించింది. ఎక్కువగా అల్లరి క్యారెక్టర్‌ లు మాత్రమే చేసిన మనోజ్‌ ఈ సినిమాతో బరువైన ఎమోషన్లు కూడా పండించగలడని ప్రూవ్‌ చేసుకున్నాడు. సూర్య పాత్రలో నేచురల్‌ గా కనిపించిన మనోజ్‌, పీటర్‌ పాత్రలో కాస్త డ్రమెటిక్‌గా కనిపించాడు. మరో కీలక పాత్రలో నటించిన దర్శకుడు అజయ్‌ ఆండ్రోస్‌ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా సముద్రం మీద తెరకెక్కిన సన్నివేశాల‍్లో అజయ్‌ నటన సినిమాకు ప్లస్‌ అయ్యింది. సిన్సియర్‌ పోలీస్‌ కానిస్టేబుల్‌ పాత్రలో పోసాని కృష్ణమురళీ మరోసారి తన మార్క్‌ చూపించాడు. జర్నలిస్ట్‌ పాత్రలో అనీష ఆంబ్రోస్‌ పరవాలేదనిపించింది. ఇతర పాత్రల్లో సుహాసిని, మిలింద్‌ గునాజీ, బెనర్జీ తమ​ పాత్రలకు న్యాయం చేశారు. కోదండ‌రామ‌రాజు సినిమాటోగ్ర‌ఫీ ఎఫెక్టివ్‌గా లేదు.ఎడిటింగ్‌ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. చాలా సీన్స్‌కు డిఐ చేసిన‌ట్లు అనిపించ‌లేదు. విద్యార్థి నాయ‌కుడి పాత్ర‌కు త‌గ్గ ఎలివేష‌న్ క‌న‌ప‌డ‌దు. ద‌ర్శ‌కుడు ఏదో అవేద‌న‌ను చెప్పాల‌నుకున్నాడని అర్థ‌మైంది కానీ..ప్రేక్ష‌కుల‌కు న‌చ్చుతుందా అని చెప్ప‌లేం.

రేటింగ్: 2.5/5

Total Views: 850 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

టీడీపీ నేతకు రాంగోపాల్ వర్మ డెడ్ లైన్!

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాలో వెన్నుపోటు పాట టీడీపీ అధినేత చంద్రబాబు