మృత్యు సంగమం : ఈ పాపం ఎవరిది?

మృత్యు సంగమంగా మారిన పవిత్ర సంగమం అనేక కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. 50మంది పర్యాటకులతో వెళ్తున్న బోటు కృష్ణా నదిలో మునిగిపోయి 19మంది చనిపోయారు. మరో పది మంది గల్లంతు కావడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. గల్లంతైన వారిలో ఐదుగురు పిల్లలు ఉన్నట్టు తెలుస్తోంది. వారి కోసం రెస్క్యూ సిబ్బంది నిర్విరామంగా గాలిస్తున్నారు. రాత్రంతా NDRF సిబ్బంది విస్తృతంగా గాలించినా ప్రయోజనం లేకపోయింది. ఉదయం నుంచి 7 NDRF బృందాలు నదిలో సెర్చ్‌ ఆపరేషన్‌ చేస్తున్నాయి. అటు.. గాలింపు చర్యలకు విశాఖ కోస్ట్‌ గార్డ్‌ సిబ్బంది సాయం కోరారు కృష్ణా జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం‌. పలువురు మంత్రులు ఘటనా స్థలాన్ని పరిశీలించి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మృతుల కుటుంబాలకు 8 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం.. తక్షణ సాయంగా బాధిత కుటుంబాలకు 50వేలు అందజేసింది. సీఎం చంద్రబాబు ఇవాళ కేరళ నుంచి వచ్చి నేరుగా బాధితులను పరామర్శించనున్నారు.

ప్రమాదం జరిగిన వెంటనే ప్రభుత్వ యంత్రాంగం హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టింది. ప్రమాదం నుంచి బయటపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఆరుగురికి చికిత్స కొనసాగుతోంది. 19 మృతదేహాలకు పోస్ట్‌మార్టం నిర్వహించి ఒంగోలులోని స్వస్థలాలకు పంపించారు.

బోటు ప్రమాదం వెనుక అడుగడుగున అరాచకాలే కనిపిస్తున్నాయి. పడవ నడిపిన రివర్‌ బోటింగ్‌ అడ్వెంచర్స్‌ సంస్థకు ఎలాంటి అనుమతులు లేవు. ఇద్దరు మాత్రమే ప్రయాణించే స్పీడ్‌ బోట్‌ తిప్పేందుకు మాత్రమే పర్యాటక శాఖ నుంచి అనుమతి తీసుకొని నిబంధనలకు విరుద్ధంగా పడవను నడిపారు. చిన్న బోటులో పరిమితికి మించి 50మంది పర్యాటకులను ఎక్కించుకోవడంతోనే ప్రమాదం జరిగింది. డ్రైవర్‌కు సరైన శిక్షణ లేకపోవడం.. నదిలో ఇసుక దిబ్బను పడవ ఢీకొనడంతో ఓ వైపునకు బోటు ఒరిగిపోయి మునిగిపోయింది.

కృష్ణానది తీరం వెంబడి రెండేళ్లుగా ప్రైవేటు సంస్థలు బోటింగ్‌ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. టికెట్లు ఇచ్చే దగ్గర నుంచి.. టూరిజం సంస్థకు లెక్కలు చెప్పేవారివరకు అన్నీ ప్రైవేటు సంస్థల వ్యక్తులే చూస్తున్నారు. ఐదారు నిమిషాలు నదిలో విహారం చేసినందుకు ఒకరికి రూ.300 చొప్పున వసూలు చేస్తున్నారు. అదే ప్యారాసెయిలింగ్‌కు రూ.1200 వరకు తీసుకుంటున్నారు. వారాంతపు రోజుల్లో రూ.లక్షల్లోనే వ్యాపారం. ప్రస్తుతం పున్నమి ఘాట్‌, దుర్గా ఘాట్‌, పవిత్ర సంగమం, కృష్ణవేణి వద్ద బోటింగ్‌ పాయింట్లు ఉన్నాయి. ఛాంపియన్‌, అమరావతి బోటింగ్‌ క్లబ్‌(ఏబీసీ), సింపుల్‌ వాటర్‌స్పోర్ట్స్‌, రివర్‌ బోటింగ్‌ సంస్థలు తమ బోట్లను తిప్పుతున్నాయి. ఆయా సంస్థలకు రాష్ట్రంతోపాటు ఇతర రాష్ట్రాల్లో కూడా బ్రాంచీలున్నాయి. అక్కడ వాడేసిన బోట్లను తీసుకొచ్చి ఇక్కడ వినియోగిస్తున్నారు. ప్రస్తుతం ప్రమాదానికి గురైన బోటును కాకినాడ నుంచి తీసుకువచ్చింది రివర్‌ బోటింగ్‌ సంస్థ. ఇక్కడ మరమ్మతులు చేసి బోటింగ్‌ చేపట్టారు.. ఆదివారం ఉదయమే ట్రయల్‌ రన్‌ వేశారు. ఇంతలోనే 17 మందిని మింగేసింది.

పర్మిషన్‌ లేకుండా బోటును నడపొద్దంటూ టూరిజం అధికారి అడ్డుకున్నా.. నిర్వాహకులు డోంట్‌ కేర్‌ అన్నారు.రివర్ బోటింగ్ సంస్థకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదని, బోటును మొదట అడ్డుకున్న టూరిజం అధికారులు.. సీజ్ చేయకుండా ఎందుకు వదిలారో అర్థంకావడం లేదని చెబుతున్నారు. కొందరు టూరిజం ఉద్యోగులే బినామీలుగా మారి ప్రైవేట్‌ బోటును నడిపిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే బోటు నిర్వాహకుల్లో ఒకరైన శేషగిరిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. నిబంధనలు లేకుండా పడవ నడిపినట్టు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని టూరిజం శాఖ మంత్రి అఖిలప్రియ హెచ్చరించారు.

Total Views: 390 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

వైసీపీలోకి జయప్రద?

ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రద వైసీపీలో చేరబోతున్నారా? త్వరలోనే