కోర్టులో తిరుమలేశుడు!

తిరుమల తిరుపతి దేవస్థానం…టిటిడి పై అటు సుప్రీంకోర్టులోనూ, ఇటు రాష్ట్ర హైకోర్టులోనూ దాఖలైన రెండు కేసులు ఒకే రోజు విచారణకు వచ్చాయి. తనను ప్రధాన అర్చక పదవి నుంచి తొలగించడాన్ని సవాలు చేస్తూ రమణ దీక్షితులు సుప్రీంలో కేసు వేశారు. తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు మరో 12 ఆలయాలను ప్రభుత్వ అజమాయిషీ నుంచి తప్పించాలని కోరుతూ బిజెపి ఎంపి సుబ్రమణ్యస్వామి రాష్ట్ర హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ రెండు కేసుల విచారణ నిన్నటి రోజు జరగడం కాకతాళీయమే అయినా… రెండూ అత్యంత ప్రాధాన్యత ఉన్న కేసులే.

టిటిడిపై రాష్ట్ర ప్రభుత్వం పెత్తనం చేస్తోందని, నిధులను ఇష్టారాజ్యంగా ఖర్చు చేస్తోందని, ఇది 2014లో సుప్రీం కోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు విరుద్ధమంటూ సుబ్రమణ్యస్వామి హైకోర్టులో వాదనలు వినిపించారు. టిటిడిలో 50 శాతానికిపైగా నిధులను ధార్మికేతర కార్యక్రమాలకు ఖర్చు చేస్తున్నారని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. టిటిడిలో ఆడిటింగ్‌ సక్రమంగా జరగడం లేదని కూడా సుబ్రమణ్యస్వామి కోర్టుకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ప్రభుత్వ, టిటిడి న్యాయవాదులు….టిటిడిలో దేవాదాయ చట్టాలకు అనుగుణంగా ఆడిటింగ్‌జరుగుతోందని వివరించారు.

ఈ కేసును సుబ్రమణ్యస్వామి వాస్తవంగా సుప్రీంలో దాఖలు చేసినప్పటికీ….రాష్ట్ర హైకోర్టుకు వెళ్లాల్సిందిగా సుప్రీం సూచించింది. దీంతో హైకోర్టును ఆశ్రయించిన ఆయన తనే స్వయంగా వాదనలు వినిపిస్తున్నారు. తిరుపతిలో అవిలాల చెరువు అభివృద్ధికి టిటిడి నుంచి 80 కోట్లు కేటాయించారు, అదేవిధంగా రేణిగుంట నుంచి కాలూరు క్రాస్‌దాకా బైపాస్‌రోడ్డు సుందరీకరణకు నిధులు కేటాయిస్తూ తీర్మానం చేశారు. టిటిడి నిధులతో తిరుపతి చుట్టుపక్కల ఉన్న చెరువులను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి పలుసార్లు అధికారులను ఆదేశించారు. ఇక ఇష్టానుసారంగా కల్యాణ మండపాలు నిర్మిస్తున్నారు. ఆలయాల పునరుద్ధరణ పేరుతో వందల కోట్లు కేటాయిస్తున్నారు. ఇటువంటి అంశాలన్నీ రాబోయే రోజుల్లో ఉమ్మడి హైకోర్టులో చర్చకు వచ్చే అవకాశాలున్నాయి.

ఇక రమణ దీక్షితులు కేసు విషయానికొస్తే….తనను శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకునిగా తొలగించడం చట్ట విరుద్ధమని, తనను ప్రధాన అర్చకునిగా పునర్‌ నియమించేలా ఆదేశాలు ఇవ్వాలని రమణ దీక్షితులు సుప్రీంను ఆశ్రయించారు. శ్రీవారి ఆభరణాలు మాయమాయ్యయని, గుప్త నిధుల కోసం పోటులో తవ్వకాలు జరిగాయని, శ్రీవారికి కైంకర్యాలు సక్రమంగా జరగడం లేదని రమణ దీక్షితులు తీవ్రమైన విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 65 ఏళ్ల నిబంధన చూపుతూ…24 గంటల్లో ఆయన్ను ప్రధాన అర్చక పదవి నుంచి తొలగించారు. దీనిపైనే ఆయన సుప్రీంలో కేసు వేశారు.

రమణ దీక్షితులు సుప్రీంకే ఎందుకెళ్లారంటే…గతంలో మిరాశీ వ్యవస్థపై సుప్రీం ఓ తీర్పు ఇచ్చింది. తీర్పు అమలులో ఏదైనా ఇబ్బందులు ఎదురైతే తనను సంప్రదించవచ్చునని అప్పట్లో కోర్టు చెప్పింది. అందుకే రమణ దీక్షితులు సుప్రీం తలుపు తట్టారు. ఆలయాల్లో మిరాశీ వ్యవస్థను రద్దు చేస్తూ ఒకప్పుడు సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అయితే… వంశపారంపర్యంగా వస్తున్న అర్చకత్వాన్ని మాత్రం సుప్రీం రద్దు చేయదు. అంటే మిరాశీ పేరుతో లభించే ఆర్థిక ప్రయోజనాలు మాత్రమే రద్దయ్యాయి…అర్చకత్వం రద్దు కాలేదు…ఇదీ రమణ దీక్షితులు చేస్తున్న వాదన. ఈ ప్రకారం తాను ప్రధాన అర్చక పదవిలో తిరిగి నియమితులు కావడం ఖాయమన్న విశ్వాసంతో రమణ దీక్షితులున్నారు.

అయితే…ఇక్కడ సుప్రీం కోర్టు మొదటి వాయిదాలోనే కీలక ప్రశ్న వేసింది. అర్చకులకూ పదవీ విరమణ వయసు (65 ఏళ్లు) నిర్ణయిస్తూ కొన్నేళ్ల క్రితమే టిటిడి నిర్ణయం చేసింది. అప్పుడే తమను ఎందుకు సంప్రదించలేదని కోర్టు ప్రశ్నించింది. టిటిడి అటువంటి నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు….అర్చకులు ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. పైగా టిటిడి అధికారులు చెప్పిన మాటలు విని కోర్టులో ఉన్న కేసులనూ ఉపసంహ రించుకున్నారు. పదవీ విరమణకు సంబంధించి టిటిడి చేసిన తీర్మానం చాలా ఏళ్లు అమలు చేయలేదు. తీరా రమణ దీక్షితులు వివాదం వచ్చినపుడు….ఆ తీర్మానాన్ని బయటకు తీసి అమలు చేసింది. ఇప్పుడు లబోదిబోమంటూ సుప్రీంను ఆశ్రయించారు.

ఏమైనా ఈ రెండు కేసులు చాలా కీలకం కానున్నాయి. ఈ కేసుల్లో తీర్పులు ఎలావుండ బోతున్నాయన్న ఆసక్తి సర్వత్రా రాష్ట్రంలో నెలకొంది. పిటిషనర్లకు అనుకూలమైన తీర్పులు వస్తే టిటిడిలో పెద్ద సంచనలమే అవుతాయి. ఇతర ఆలయాలపైనా ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి.

Total Views: 581 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

రెండు ముక్కలైన జమ్మూకశ్మీర్

జమ్మూకశ్మీర్ విషయంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంది. మోడీ