మహోన్నత శిఖరం ఈ ‘మగ మహారాజు’

మెగాస్టార్ చిరంజీవి.. స్వయంకృషికి చిరునామా. ఎన్నో ఛాలెజింగ్ తో బాక్సాఫీస్ నూ అభిమానుల్నీ గెలుచుకున్న విజేత. అందుకే నీ ప్రాణం ఖరీదు ఎంత అంటే అభిమానుల గుండె చప్పట్లంత అని చెబుతాడు. ప్రతిభ శిఖరమంతైనా..ఏనాడూ ప్రయత్నలోపం పిసరంత కూడా చూపని డాక్టర్ శంకర్ దాదా. దశాబ్ధాలుగా బాక్సాఫీస్ ను హిట్లర్ లా రూల్ చేస్తోన్న ఈ వెండితెర ఇంద్రుడిని ఆదర్శంగా తీసుకుని.. ఇండస్ట్రీకి వచ్చిన వాళ్లెంతోమంది..? మాస్ హీరో మీనింగ్ ను మార్చేసి.. సినిమా కమర్షియల్ స్టాండర్డ్స్ ను ఎల్లలు దాటించిన మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు నేడు.

‘పునాదిరాళ్ళు’ చిత్రంతో చిరు సినీ ప్రస్థానానికి పునాది పడింది. `ఖైదీ`గా ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు. తెలుగు సినీ ప్రస్థానంలో `విజేత` అయ్యాడు. మాస్ ప్రేక్షకుల కోసం `ఘరానా మొగుడు` అవతారం ఎత్తాడు. నమ్ముకున్న వారికోసం త్యాగం చేసే ఇంద్రుడై వెలిగాడు. లంచగొండుల పాలిట `ఠాగూర్` గా నిలిచాడు. ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కల్లేవ్‌. సరిగ్గా 60ఏళ్ళ వెన‌క్కి లైఫ్‌రీల్‌ని వెన‌క్కి తిప్పితే.. గోదారి న‌దీతీరం.. ఆ తీరానికి వెళ్లే దారిలో వున్న మొగల్తూరుకి తెలియకపోవచ్చు ఆ కుర్రాడు భవిష్యత్ లో సినీ సంచలనానికి కేంద్రబిందువుగా మారబోతున్నాడ‌ని అంజ‌నీపుత్రుని క‌న్న‌ అంజనా వెంకట్రావ్ దంపతులు ఊహించి ఉండ‌రు. ఒక సంచ‌ల‌నం భువిపై వెల‌సాడ‌ని.

అప్పటికే ఎన్.టి.ఆర్ ని ప్రేక్ష‌కులు దేవుడిగా కొలుస్తున్నారు. ఏఎన్నార్‌ నవలానాయకుడిగా ప్రేమాద‌రాలు పొందుతున్నారు. కృష్ణ కొత్తదనంతో కీర్తింపబడుతున్నారు.. అలాంటి స్టార్ల‌ ముందు నిలబడాలంటే ఏం చెయ్యాలి.. ? ఒకే ఒక్క ఛాన్స్‌.. త‌న‌దైన స్టైల్లో వెళ్ల‌డ‌మే. ముఖ్యంగా డాన్స్ త‌న‌ని పై లెవ‌ల్‌కి చేర్చుతుంద‌న్న అంచ‌నా. అప్పటిదాకా తెలుగు హీరోల్లో ఈ త‌ర‌హా డాన్సులు చేసే మొనగాడు లేనేలేడు. డ్యాన్సుల్లో తనకంటూ ఒక బెంచ్ మార్క్ సృష్టించుకోవ‌డంలో మెగాస్టార్ పెద్ద స‌క్సెస్‌ అయ్యారు.

కమర్షియల్ సక్సెస్ లకు కరెక్ట్ మీనింగ్ చెప్పిన ఘనత చిరుది. అప్పటివరకూ కనీ వినీ ఎరుగని హీరోయిజం కళ్ళముందు కదలాడే సరికి అభిమానులు ఉబ్బితబ్బిబ్బైపోయేవారు. సుప్రీమ్ హీరోగా పిలుచుకున్నారు ఫ్యాన్స్‌. ఆ తర్వాత మెగాస్టార్ అంటూ ప్ర‌మోట్ చేశారు. అసలు హీరోల కటౌట్ లకు పాలాభిషేకాలు ప్రారంభమయ్యిందే చిరుతోనే. చిన్న పిల్లలు కొత్తగా ఒక డైలాగ్ చెప్పినా ఒక స్టెప్పేసినా చిన్నగా నవ్వించినా “ఈడు పెద్దయ్యాక చిరంజీవైపోతాడు“ అన్న డైలాగ్ ప్రతీ ఇంట్లో వినిపించేదంటే ..ద‌టీజ్ మెగాస్టార్ ప‌వ‌ర్‌. ఆ రేంజ్ కి ఎదిగిపోయాడు కొణిదెల శివశంకర వరప్రసాద్.

చిరంజీవిని జయాపజయాల కొలతల్లో చూడకూడదు.. లక్ష్యాన్ని చేరుకోవడానికి అతను పడ్డ శ్రమను చూడాలి. ఎంచుకున్న రంగంలో రాణించడానికి అతను చూపించిన వైవిధ్యం చూడాలి. రొటీన్ అన్న పదాన్ని బ్రేక్ చేస్తేనే క్రియేటివ్ ఫీల్డ్ లో ఉండగలరు. ఆ విషయాన్ని గుర్తించడానికి చిరంజీవిని చూడాలి. అలా చూసిన ఎందరికో ఆయన చేయూతనిచ్చాడు. సినిమా సంద్రంలోకి దూకాలనుకున్న వారిని నదిలా అక్కున చేర్చుకుని.. ఆ సంద్రం వైపు నడిపిస్తున్నాడు.. సినిమా రంగానికి దూరమైన తొమ్మిదేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఖైదీ నెంబర్ 150తో ఇచ్చాడు. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాడు. మెగాస్టార్ గా కోట్లమంది హృదయాల్లో కొలువై ఉన్న చిరంజీవి ఇప్పుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో రాబోతున్నాడు. చిరంజీవి అంటే ఎంటర్టైన్మెంట్.. అది అందిస్తే చాలు.. ఆ ఫ్యామిలీ నుంచి ఇంకెంతమంది వచ్చినా ఆదరిస్తామంటున్నారు అభిమానులు.. ఈ విషయాన్ని గుర్తుంచుకుని చిరు సినిమాల్లోనే ఉండిపోవాలని కోరుకుంటూ.. అలనాటి శివ శంకర వర ప్రసాద్.. నేటి చిరంజీవికి పుట్టిన రోజు శుభాకాంక్షలతో..

Total Views: 1594 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

శ్రీకాకుళం ప్రజల కష్టాలు చూసి కన్నీళ్ళొచ్చాయి : పవన్ కళ్యాణ్

శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుపాను సృష్టించిన విధ్వంసంతో జరిగిన నష్టం