సింహపురి సోగ్గాడు ఇకలేరు!

సీనియర్ నేత ఆనం వివేకానంద రెడ్డి కన్ను మూశారు. నెల్లూరు జిల్లాకు చెందిన ఆనం వివేకానందరెడ్డి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆనం వివేకానందరెడ్డి వయస్సు 67 సంవత్సరాలు.ఆరు నెలల క్రితం వరకూ ఆయన పలు మీడియా సమావేశాల్లో పాల్గొన్నారు. టీడీపీ లోచేరిన ఆనం వివేకానంద రాజకీయాల్లో చురుగ్గానే పాల్గొంటున్నారు. నెల రోజుల నుంచి హైదరాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆనం వివేకాకు ఇద్దరు కుమారులున్నారు. ఆయన మృతితో నెల్లూరులో ఆనం అభిమానుల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.ఆనం వివేకాది ప్రత్యేక స్టయిల్. నెల్లూరు అంటే ముందు గుర్తొచ్చేది ఆనం సోదరులే. ఆనం వివేకా మృతి వార్త తెలుసుకున్న ఆయన అభిమానులు బోరున విలపిస్తున్నారు.

ఆనం వివేకా గురించి..!
నెల్లూరుజిల్లా రాజకీయాలంటే గుర్తొచ్చే నాయకులు ఒక బెజవాడ గోపాలరెడ్డి, ఒక నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి, ఒక ఏ.సి.సుబ్బారెడ్డి, ఒక నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి, ఒక పుచ్చలపల్లి సుందరయ్య… ఒక వెంకయ్యనాయుడు… రాజకీయ చరిత్రలో వీరందరివీ ఒక శైలి. కాని, ఆనం వివేకానందరెడ్డి… విలక్షణ రాజకీయాలకు బ్రాండ్‌ అంబాసిడర్‌. 20ఏళ్ళ పాటు నెల్లూరు నగరాన్ని శాసించిన లీడర్‌. కుర్రాడు, వృద్ధుడు అనే తేడా లేకుండా నెల్లూరీయుల మనసుల్లో వివేకాగా ముద్రపడ్డ నాయకుడు.

మాజీమంత్రి స్వర్గీయ ఆనం వెంకటరెడ్డి నలుగురి కుమారులలో పెద్దోడు. పెద్దనాన్న ఏ.సి.సుబ్బారెడ్డి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న నాయకుడు. ఏ.సి.సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డిల తరం తర్వాత ఆనం వంశ రాజకీయాలను నడిపించిన దమ్మున్న నేత. మున్సిపల్‌ కౌన్సిలర్‌గా మొదలైన ఆయన రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులున్నాయి. 1983లోనే తన తమ్ముడు ఆనం రామనారాయణరెడ్డికి నెల్లూరు అసెంబ్లీకి ఎమ్మెల్యేగా పోటీచేసే అవకాశం వచ్చినా, వయసులో పెద్దోడైన ఆయనకు మాత్రం ఎమ్మెల్యే అయ్యే అవకాశం 45ఏళ్ళ వయసుకు గాని రాలేదు. నెల్లూరు మున్సిపల్‌ వైస్‌ఛైర్మెన్‌గా ఎన్నికయ్యాక 1995లో జరిగిన నెల్లూరు మున్సిపల్‌ ఛైర్మెన్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా 36ఓట్లతో నెగ్గిన వివేకా రాజకీయ యాత్ర అక్కడ నుండే ఊపందుకుంది. 1983 నుండి తెలుగుదేశంలో వుండి 1985లో కొంత కాలం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఛైర్మెన్‌గా కూడా పనిచేసిన వివేకాకు ఆ పార్టీలో వున్నంతకాలం అంతకుమించిన అవకాశాలు రాలేదు. 1985ఎన్నికల్లో నెల్లూరు సీటును ఆశించినా ఇవ్వలేదు. 1989ఎన్నికల్లోనూ ఆయనకు మొండిచేయే చూపారు. దీంతో 1992లో కాంగ్రెస్‌లోకి వెళ్ళిన ఆయనకు 1995లో నెల్లూరు మున్సిపల్‌ ఛైర్మెన్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా అవకాశం ఇచ్చింది. తెలుగుదేశం ప్రభుత్వం నడుస్తున్న ఆ కాలంలో వివేకా 36ఓట్లతేడాతో వై.టి.నాయుడుపై సంచలన విజయం సాధించాడు. నాలుగేళ్ళపాటు మున్సిపాల్టీలో చక్రం తిప్పాడు.

1999ఎన్నికల ద్వారా ఎమ్మెల్యేను కావాలనుకున్న తన చిరకాల స్వప్నాన్ని నెరవేర్చుకున్నాడు. 1999 అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లూరు నియోజకవర్గం నుండి కాంగ్రెస్‌ అభ్యర్థిగా నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డిని సైతం ఢీకొట్టి టికెట్‌ తెచ్చుకున్నాడు. బీజేపీ అభ్యర్థిగా డేగా నరసింహారెడ్డిపై గెలుపు సాధించారు. ఐదేళ్ళపాటు ప్రతిపక్ష నేతగా విలక్షణ పాత్ర పోషించారు. అధికారపక్షానికి చుక్కలు చూపించారు. 2004 ఎన్నికల్లో మళ్ళీ నెల్లూరు నుండే రెండోసారి ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలుపొందారు. సరిగ్గా అప్పుడే రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌ ప్రభుత్వం రావడం, వై.యస్‌.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి కావడంతో జిల్లా రాజకీయాల్లో ఆనం హవా మరోసారి మొదలైనట్లయ్యింది. ఆనం సోదరులు నెల్లూరుజిల్లాలో వై.యస్‌.కు ముఖ్యఅనుచరులుగా ముద్రపడ్డారు. వై.యస్‌. అండతో పార్టీలో నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి వర్గాధిపత్యాన్ని సవాల్‌ చేస్తూ తమ వర్గాన్ని పెంచుకున్నారు. ప్రతి నియోజకవర్గంలో ఆనం వర్గం ఏర్పడింది. 2007లో వై.యస్‌. క్యాబినెట్‌లో ఆనం రామనారాయణరెడ్డి మంత్రయ్యాడు. పెద్దవాడిగా వివేకా అడిగితే మంత్రి పదవి వచ్చే అవకాశమున్నా ఆయన ఆనాడు తనకు కాకుండా తన తమ్ముడి కోసమే మంత్రి పదవి అడిగి సోదరుల పట్ల తన వాత్సల్యం చాటుకున్నారు.

వై.యస్‌. కొలువులో రామనారాయణరెడ్డి మంత్రి అయ్యాక ఆనం జోరు పెరిగింది. 2009 ఎన్నికలనాటికి నేదురుమల్లిపై పైచేయి సాధించారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజన జరగడంతో కొత్తగా ఏర్పడ్డ నెల్లూరురూరల్‌ నుండి పోటీ చేసిన వివేకా ప్రజారాజ్యం అభ్యర్థి తన సమీప బంధువు ఆనం వెంకటరమణారెడ్డితో గట్టిపోటీనెదుర్కొని 3131ఓట్లతో అతి కష్టం మీద గట్టెక్కారు. 2009 సెప్టెంబర్‌లో వై.యస్‌.రాజశేఖరరెడ్డి మరణం చాలామంది కాంగ్రెస్‌ నాయకుల జీవితాలలో పెనుమార్పులు తెచ్చింది. రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిలు ముఖ్యమంత్రులయ్యారు. కాని, చాలామంది కాంగ్రెస్‌ నాయకులు రాజకీయంగా తెరమరుగయ్యారు. కొందరు గత వైభవాన్ని కోల్పోయారు. వారిలో ఆనం వివేకా కూడా వున్నారు.

వై.యస్‌. మరణానంతరం తొలిరోజుల్లో జగన్‌కు అండగా నిలిచి ఆయన తరపున గట్టిగా పోరాడిన వివేకా ఆ తర్వాత కొద్దిరోజులకే తన వాణిని మార్చారు.జగన్‌కు వ్యతిరేకంగా గళం విప్పారు. జగన్‌ కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీని ధిక్కరించడం, 2012లో కాంగ్రెస్‌పార్టీ నుండి బయటకొచ్చి వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీని స్థాపించడం జరిగింది. ఈ దశలో జగన్‌పై వివేకా విమర్శలు తీవ్రస్థాయికి చేరాయి. తెలుగుదేశం నాయకులు కూడా జగన్‌పై ఆరోపణలు చేయనంతగా వివేకా ఆరోపణలు చేసారు. జగన్‌పై వివేకా చేసిన ఆరోపణలను ఆయన అనుచరులు, అభిమానులు సైతం జీర్ణించుకోలేకపోయారు. వై.యస్‌. మరణంతో ఆనంకు ఓ రకంగా రాజకీయ గ్రహణం పడితే, 2014లో జరిగిన రాష్ట్ర విభజనతో మరోరకంగా దరిద్రం పట్టింది. విభజనతో ఏపిలో కాంగ్రెస్‌ పతనమైంది. 2014 ఎన్నికల చివరి వరకు సీఎం కుర్చీ మీద ఆశతో ఆనం సోదరులు కాంగ్రెస్‌లోనే వుండిపోయారు. 2014 ఎన్నికల్లో వివేకా పోటీ చేయకుండా నెల్లూరు నగరం నుండి తన కొడుకు ఏ.సి.సుబ్బారెడ్డిని కాంగ్రెస్‌ అభ్యర్ధిగా దించాడు. ఆ ఎన్నికల్లో ఆయనకు కనీసం డిపాజిట్‌ కూడా దక్కలేదు.

2014 ఎన్నికల్లో తెలుగుదేశం అధికారంలోకి రావడం జరిగింది. 2015లో ఆనం వివేకా, ఆనం రామనారాయణరెడ్డిలు తెలుగుదేశంలో చేరారు. పార్టీలో చేరేటప్పుడు ఆనం వివేకాకు ఎమ్మెల్సీని, ఆనం రామనారాయణరెడ్డికి ఆత్మకూరు ఇన్‌ఛార్జ్‌ హామీ ఇచ్చారు. అయితే రామనారాయణరెడ్డికి ఆత్మకూరు ఇన్‌ఛార్జ్‌ అయితే ఇచ్చారు గాని ఎమ్మెల్సీ విషయంలో వివేకాకు మొండిచేయి చూపారు. దీనికితోడు పార్టీలో ఆనం బ్రదర్స్‌కు అవమానాలే మిగిలాయి. కాంగ్రెస్‌లో నెల్లూరు జిల్లాను ఏకఛత్రాధిపత్యంగా ఏలిన ఆనం సోదరులకు టీడీపీలో కనీసం పార్టీ సమావేశాలకు కూడా ఆహ్వానం కరువైంది. ఒకప్పుడు తమ ముందు కూర్చోవడానికి కూడా భయపడే నాయకులు వీళ్ళు తెలుగుదేశంలో చేరాక వీళ్ళనే ఆటాడించసాగారు. తెలుగుదేశంలో చేరాక వీరి పరిస్థితి పూలమ్మిన చోటే కట్టెల కొట్టు పెట్టుకున్నట్లుగా అయ్యింది.

Total Views: 216 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

వైసీపీలోకి జయప్రద?

ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రద వైసీపీలో చేరబోతున్నారా? త్వరలోనే