బహుదూరపు బాటసారి దాసరి “మహాప్రస్థానం”

తెలుగు చిత్ర పరిశ్రమ పెద్ద దిక్కును కోల్పోయింది. నూటా యాబైకి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన దాసరి బహుముఖ ప్రజ్ఞాశాలి. పాతిక చిత్రాలను స్వయంగా నిర్మించారు. దాసరి చిత్రాలకు కథతో పాటు ..పాటలు మాటలు ప్రాణం. కటకటాల రుద్రయ్య, ప్రేమాభిషేకం, బొబ్బిలిపులి వంటి పలు సూపర్‌ హిట్‌ చిత్రాలకు డైలాగులే ప్రాణం. ఎంతో మంది దర్శకులు…నటలును పరిచయం చేశారు. దర్శక నిర్మాతగా..కథ ..మాటలు..పాటల రచియతగా తెలుగు చిత్ర సీమపై దాసరిది చెరగని ముద్ర!

సహాయం చేయాలన్నా.. వ్యంగ్యస్త్రాలు విసరాలన్నా.. ప్రత్యర్థులపై సినిమాస్త్రాలు సంధించాలన్నా.. ఆయనకు ఆయనే సాటి. స్వయం కృషి, ప్రతిభ ఉంటే ఎంత ఎత్తుకైనా ఎదగవచ్చనని నిరూపించిన దాసరి తిరిగిరాని లోకాలు వెళ్లిపోయారు.

తాతా మనవడుతో మొదలు పెట్టి ఎవరికివారే యమునా తీరే అనేలా ఉండే సినీ సంసార సాగరంలో, రాధమ్మ పెళ్లి, భారతంలో ఒక అమ్మాయి, ముద్దబంతిపువ్వు, ఓ మనిషీ తిరిగి చూడు మనుషులంతా ఒక్కటే అంటూ బలిపీఠంపై కాదు స్వర్గం నరకం గురించి ఆలోచించకు ఎందుకంటే జీవితమే ఓ నాటకరంగం కదా ఇంక పాడవోయి భారతీయుడా అంటూ తన సినిమాలతో సామాజిక సందేశాల్ని ఎలుగెత్తి చాటిన దిగ్ధర్శకుడు దాసరి.

అందలమెక్కాలంటే అండదండలుండక్కర్లేదు. అంతులేని ఆత్మవిశ్వాసం ఉంటే చాలు అని నిరూపించిన వ్యక్తి దాసరి నారాయణరావు. ట్రెండ్ కు భిన్నంగా వెళ్లి నూటికి నూరు శాతం విజయం సాధించారాయన. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా..ఏకబిగిన 150 సినిమాలు తీశారు. గిన్నిస్ బుక్ లోకి ఎక్కారు. ఆ దర్శక రత్నం తీసిన సినిమాల్లో 90 చిత్రాలు క్లీన్ యు సర్టిఫికెట్ సాధించాయి. నాటి తాతామనవడు నుంచి ఎర్రబస్సు వరకూ ఎన్నో సంచలనాలు. ఎన్నో రికార్డులు. మరెన్నో రివార్డులు. అన్ని కలిస్తే దాసరి. అందుకే ఆయన దర్శకరత్నమయ్యారు. అన్నిటిని వదిలి అనంతలోకాలకు పయనమయ్యారు.

నేటి తరంలో ఎంతో మంది చేయలేని సాహసాలను దాసరి ఎప్పుడో చేశారు. ఆయన చేసిన చిత్రాలన్నీ సమాజానికి సందేశాలే! దాసరి కీర్తికిరీటంలో కలికితురాయి మేఘ సందేశం. ప్రేమ, వ్యామోహాలను ఎన్నో కోణాల నుంచి స్పృశిస్తుందా చిత్రం. దాసరి ఎప్పుడూ స్టార్ల వెంట పరుగులు తీయలేదు. కథే స్టార్ గాఎంతో మంది స్టార్స్ ను తయారు చేశారు. దాసరి నారాయణరావు సినిమాలంటే కథాబలం ఉన్న చిత్రాలుగా పేరు తెచ్చుకున్నారు. తెలుగు సినిమా మలి చరిత్రలో దర్శకుడి పేరుతోనే ఓపెనింగ్స్ తెచ్చిన ఏకైక దర్శకుడాయన. అందుకే పోస్టర్ పై హీరోకు సమానంగా ఆయన ఫోటో ఉన్నా ఆడియన్స్ ఆనందంగానే ఫీలయ్యారు.

దాసరి ఏ సినిమా చేసినా అందులో ఖచ్చితంగా మానవీయ కోణం ఉంటుంది. సామాజిక బాధ్యత ఉంటుంది. ప్రతి పాత్రకూ ఏదో ఒక బాధ్యత ఉంటుంది. నిజానికి ఇలాంటి కథాంశాలను ఎంచుకుని అన్నేళ్లుగా ఎన్నో విజయాలు అందుకున్న దర్శకుడు దాసరి తప్ప మరొకరు లేరనటం అతిశయోక్తికాదు. ఎన్టీఆర్ తో దాసరి సినిమాలు చరిత్ర సృష్టించాయి. ఎన్టీఆర్ పార్టీ పెట్టి సరికొత్త చరిత్ర సృష్టించటంలో ఆ సినిమాలు ప్రముఖ పాత్ర పోషించాయి. బొబ్బిలిపులి, సర్ధార్ పాపారాయుడు చిత్రాలు చూస్తే దాసరి కలం బలం తెలుస్తుంది. సమాజంపై, మన రాజకీయ వ్యవస్థపై ఆయనకున్న పట్టూ తెలుస్తుంది..

90 దశకం దాసరికి చాలా ప్రత్యేకం. సూరిగాడు చిత్రంలో దర్శక నటుడిగా, ముత్యాల సుబ్బయ్య డైరెక్షన్ లో మామగారుగా ఆయన నటన అసమానం. అద్భుతమైన తన నటనతోనే ఆ రెండు సినిమాలనూ నిలబెట్టారు. అప్పటి వరకూ ఆయన నటుడిగా చాలా సినిమాల్లో కనిపించినా అవన్నీ ఒకెత్తు, ఈ రెండూ ఒకెత్తు.. అంటే అతిశయోక్తి కాదు. అమాయకుడైన పల్లెటూరి వ్యక్తిగా, తండ్రిగా, మామగా.. మామగారు సినిమాలో దాసరి చూపించిన నటనకు ఎవరైనా ముగ్ధులు కావాల్సిందే. అంతలా తన నటనతో ఈ సినిమాను మరో మెట్టు పైకి తీసుకువెళ్లారు దాసరి.

ఇక తెలుగు సినిమా హిస్టరీలో ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేసిన మరో సినిమా ఒసేయ్ రాములమ్మా. ఈ సినిమాతో దాసరి కీర్తి శిఖరాన్ని తాకిందనే చెప్పాలి. అనన్యసామాన్యమైన కథాంశంతో విజయశాంతి ప్రధాన పాత్రలో దాసరి రూపొందించిన ఈ సినిమా తెలుగు సినిమా గమనాన్ని కొన్నాళ్ల వరకూ శాసించింది. ఒసేయ్ రాములమ్మా కంటే ముందే వచ్చిన ఒరేయ్ రిక్షా మరో సంచలనం..ఆర్. నారాయణమూర్తి హీరోగా నటించిన ఈ సినిమా క్లాస్ మాస్ అన్నతేడా లేకుండా బి సి సెంటర్స్ అనే భేదం లేకుండా విజయదుందుభి మోగించింది.

దశాబ్దాలపాటు సినీపరిశ్రమకు పెద్ద దిక్కు దాసరి. ఆయన మరణంతో ఇంటి పెద్దను కోల్పోయిన కుటుంబాన్ని తలపిస్తోంది తెలుగు సినీ పరిశ్రమ. అందరి అభిమానాన్ని..ప్రేమను పొంది..వాటిని అందరికీ పంచి వెళ్లిపోతున్న ఆయన ఎప్పుడూ సినీ పరిశ్రమకు మార్గదర్శే! ఎన్నటికీ లెజెండే!

Total Views: 2219 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

కూకట్‌పల్లి బరిలో సుధాకర్ నాయుడు!

ప్రముఖ సినీనటుడు జీవీ సుదాకర్‌నాయుడు కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా