అదే మాసు, అదే గ్రేసు.. అదే హోరు, అదే జోరు

untitled-1‘ఖైదీ-150’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ అత్యంత కోలాహలంగా సాగడంతో మెగాస్టార్ చిరంజీవి పులకించిపోయారు. ‘సరిపోలేదు…మీ ఈలలు, కేకలు, చప్పట్లు విని చాలా సంవత్సరాలయింది. వీటికి ఎంత శక్తి ఉందో అనుభవపూర్వకంగా తెలిసిన వాడిని’ అంటూ అభిమాన ప్రేక్షుకలను ఉత్తేజ పరిచారు. పది సంవత్సరాల వ్యవధిలో అదే ప్రేమ నన్ను అక్కున చేర్చుకుని మళ్లీ ‘బాస్ ఈజ్ బ్యాక్’ అనేలా చేసిన శక్తి అభిమాన దేవుళ్లేనంటూ కృతజ్ఞతలు తెలిపారు.

దాసరి గురించి:
సినిమా ఫుల్‌మీల్స్‌లా ఉంటుందని చెబుతూనే…దర్శకరత్న దాసరికి చిరంజీవి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సినిమా టైటిల్ ఆయనే సూచించారని తెలిపారు. సినిమా ప్రారంభమైనప్పుడు ఖైదీ దుస్తులో షర్ట్ మీద 150వ నెంబర్ ఉన్న ఓ చిన్న ఫోటో బయటకు వచ్చిందని, అది చూసి దాసరి నారాయణరావు తనకు ఫోను చేసి సినిమాకు ‘ఖైదీ నెబర్ 150’ టైటిల్ పెట్టాలని సూచించారని తెలిపారు. ఇదే విషయాన్ని దర్శకుడు వినాయక్‌కు చెప్పి అదే టైటిల్ ఫిక్స్ చేశామని అన్నారు. దాసరి సలహాకు సభాముఖంగా కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు.

వినాయక్ గురించి:
ఫంక్షన్‌లో చిరంజీవి ఉద్వేగంగా మాట్లాడారు. తనకు నాగబాబు, పవన్ కళ్యాణ్‌ ఇద్దరు సోదరులనేది అందరికీ తెలుసని అయితే మూడో తమ్ముడు కూడా ఉన్నాడని చెప్పారు. తన హృదయానికి అతి దగ్గరగా ఉన్నవాడంటూ సినిమా దర్శకుడు వివి వినాయక్ గురించి చెప్పారు. తన ఇద్దరు సోదరుల సరసన మూడో తమ్ముడంటూ వివి వినాయక్‌ గురించి గొప్పగా చెప్పారు.

రామ్‌చరణ్‌ గురించి:
రామ్‌చరణ్‌పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించారు. ‘చరణ్…ఐ బ్లెస్ యూ’ అంటూ చిరంజీవి అభినందనలు తెలిపారు. తన 150వ చిత్రాన్ని రామ్‌చరణ్ నిర్మించడంపై చిరంజీవి మాట్లాడుతూ ‘రామ్‌చరణ్ నిర్మాత అవుతాడని నేను ఊహించలేదు. ఇంత సమర్ధవంతమైన నిర్మాత అవుతాడని కూడా అనుకోలేదు’ అంటూ చెప్పారు. చిరంజీవి 150వ సినిమా రావాలని వివిధ వేదికల్లో ఎందరెందరో ప్రముఖులు అన్నప్పుడు, తప్పనిసరిగా నాన్నతో 150వ సినిమాను స్వయంగా నిర్మిస్తానని రామ్‌చరణ్ చెప్పాడని చిరంజీవి గుర్తు చేసుకున్నారు. ఎంతో మంది నిర్మాతలు ఉన్నారని, నువ్వే చేయాలా అని తాను అడిగానని, అయితే రామ్‌చరణ్ పట్టుదలతో సినిమా చేశాడని అన్నారు. నటనా హద్దులతో పాటు నిర్మాణ పద్దులు కూడా రామ్‌చరణ్‌కు తెలుసునని అన్నారు. అందుకు ఓ ఉదాహరణ చెబుతూ, ‘ధ్రువ’ సినిమా షూటింగ్ కోసం బ్యాంకాక్‌లో చరణ్ ఉన్నప్పుడు విదేశాల్లో ‘ఖైదీ 150’ షూటింగ్ జరిగిందని, ఆ సమయంలో స్వయంగా రామ్‌చరణ్ ఎప్పటికప్పుడు ఆ విషయాలు తెలుసుకుని ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్‌లతో మాట్లాడి అందరి అవసరాలు చూసుకున్నాడని అన్నారు. చరణ్ తన టెక్నీషియన్లను బాగా చూసుకున్నాడని, భవిష్యత్తులో మంచి నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా చరణ్ నిలబడతాననే నమ్మకం తనకుందని, అలాగే తనకున్న అగ్ర నిర్మాతల సరసన చరణ్ కచ్చితంగా నిలబడతాడని తాను చెప్పగలనని అన్నారు.

కాజల్‌ గురించి:
హీరోయిన్ కాజల్‌ అగర్వాల్‌ను ఆకాశానికెత్తేశారు. ఈ కాజల్ ఈ సినిమా ద్వారా అభిమానులను మరింత ఆకర్షిస్తుందని అన్నారు. తన అందం చందంతో ఆకట్టుకుంటుందని అన్నారు. గతంలో ఏ హీరోయిన్‌కు లేని రికార్డును కాజల్ ఈ సినిమా ద్వారా సాధించిందని చిరంజీవి అన్నారు. తండ్రితో చేసిన హీరోయిన్ తిరిగి కుమారుడితో చేయడం గతంలో ఉందని, కానీ కాజల్ మాత్రం తొలుత కొడుకు రాంచరణ్‌తో నటించిన తర్వాత తనతో నటించడం అరుదైన రికార్డు అని కాజల్‌ను కొనియాడారు.

దేవీశ్రీ గురించి:
‘దేవీశ్రీ ప్రసాదా…మజాకానా…ఇరగదీసే మ్యూజిక్ ఇచ్చారు’ అంటూ ‘ఖైదీ-150’ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో చిత్ర కథనాయకుడు, మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించారు. తన బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టుగా అద్భుతైన మ్యూజిక్ కంపోజ్ చేసిన క్రెడిట్ దేవీకి దక్కుతుందన్నారు. ముఖ్యంగా ‘అమ్మడూ లెట్స్ డూ కుమ్ముడూ’ పాటను ఆన్‌లైన్‌లో కోట్లాది మంచి చూశారంటే ఆ పాత ఎంత పెద్ద హిట్టే అర్ధం అవుతుందన్నారు. అలాగే, సుందరీ సుందరీ, రత్తాలు, రత్తాలు…నిన్ను చూస్తుంటే నిలబడనంటాయి నా చొక్కా బొత్తాలు’ వంటి పాటలు ప్రేక్షకాభిమానులను ఉర్రూతలూగిస్తాయని చిరంజివి ధీమా వ్యక్తం చేశారు. అలాగే సినిమాలో రైతులపై కంపోజ్ చేసిన ‘నీరు నీరు నీరు’ పాట ఎంతో హృద్యంగా ఉంటుందన్నారు.

రచయిత సత్యానంద్‌ గురించి:
సీనియర్ రచయిత సత్యానంద్‌తో కూడా తాను చర్చించి స్క్రిప్టు సహకారం తీసుకున్నానని, ఆయన ఈ సినిమాకి అజ్ఞాత వ్యక్తిగా పని చేశారని చిరంజీవి చెప్పారు.

పంచ్ డైలాగులు:
పంచ్ డైలాగులు చెప్పి అభిమానులను ఉర్రూతలూగించారు. ‘పొగరు నా ఒంట్లో ఉంది. హీరోయిజం నా ఇంట్లో ఉంది. కార్పొరేట్ బీరు తాగిన బాడీ నీది. కార్పొరేషన్ నీరు తాగిన బాడీ నాది. ఆఫ్టర్ ఏ గ్యాప్.. బాస్ ఈజ్ బ్యాక్’ అని సినిమాలో ఓ సందర్భంలో వచ్చే డైలాగ్‌ను చిరు తన స్టైల్‌లో చెప్పినప్పుడు సభా ప్రాంగణం దద్దరల్లింది.

డైలాగ్‌కు దద్దరిల్లిన ప్రాంగణం:
తనదైన స్టైల్లో అద్భుతంగా డైలాగ్స్ చెప్పి అలరించారు. ఆ సమయంలో స్టేజ్‌పై ఉన్నవారితో సహా అందరూ చప్పట్లు కొట్టడంతో ప్రాంగణం దద్దరిల్లింది. ఈలలు, చప్పట్లు, కేకలతో హోరెత్తింది. ముఖ్యంగా అల్లు అర్జున్ అయితే చప్పట్లు కొడుతూనే ఉన్నాడు. చేతితో పేపర్ చింపుతున్నట్టు సైగలు చేస్తూ, చిరు చిపేశారని అన్నాడు. ఇంతకీ మెగాస్టార్ చెప్పిన డైలాగ్ ఏమంటే… ‘రాననుకున్నారా, రాలేననుకున్నారా? ఢిల్లీకి పోయాడు డ్యాన్స్‌లకు దూరమైపోయాడు. హస్తినా పురానికి పోయాడు హస్యానికి దూరమైపోయాడు. ఈ మధ్య కాలంలో మన మధ్య లేదు, అందుకే మాస్‌కు దూరమైపోయాడని అనుకుంటున్నారేమో. అదే మాసు, అదే గ్రేసు. అదే హోరు, అదే జోరు, అదే హుషారు.’

ఆసక్తికర వ్యాఖ్యలు:
కొసమెరుపుగా చిరంజీవి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సంక్రాంతికి విడుదల అవుతున్న తన సినిమా ఖైదీతో పాటు బాలయ్య సినిమా గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమాను కూడా ఆదరించాలని అభిమానులను కోరారు. బాలయ్య సినిమాతో పాటు ఆర్ నారాయణ మూర్తి హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య, శతమానం భవతి వంటి సినిమాలను కూడా ఆదరించాలని కోరారు. తద్వారా చిరు తన గొప్పమనసును చాటుకున్నారు.

Total Views: 2383 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

జాతీయ అవార్డు విజేతలు వీరే

2017 సంవత్సరానికి గానూ జాతీయ సినిమా అవార్డులను కేంద్రం ప్రకటించింది.