వాజ్‌పేయి ప్రస్థానంలో 8 కీలక నిర్ణయాలు ఇవే!

అటల్‌ బిహారీ వాజపేయిది సుదీర్ఘ రాజకీయ జీవితం.. దాదాపు నాలుగున్నర దశాబ్దాల పాటు రాజకీయాల్లో చురుకైన పాత్రను పోషించారు. విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు పొందిన ఘనత వాజపేయిది. వాజపేయి వాగ్ధాటిని చూసిన జవహర్‌లాల్‌ నెహ్రూ.. ఎప్పటికైనా ప్రధాని అవుతారని కితాబిచ్చారు. దాదాపు నాలుగు దశాబ్దాలకు ఆ వ్యాఖ్యలు నిజమయ్యాయి. ఆయన రాజకీయ ప్రస్థానంలో తీసుకున్న 8 నిర్ణయాత్మక ఘటనలు..

ఫోఖ్రాన్ 2 (1998)

భారతదేశం అణు సంపన్నతను సాధించిన దేశంగా చెరగని యశస్సును సాధించడంలో వాజపేయిది విశేష పాత్ర. 1974లో తొలిసారి ప్రోఖ్రాన్‌లో అణుపరీక్ష చేశాక.. 24 ఏళ్ల తర్వాత.. 1998లో వాజపేయి నేతృత్వంలోనే.. ప్రోఖ్రాన్‌లో ఐదు భూగర్భ అణుపరీక్షలను నిర్వహించారు. దీంతో సమాచారం, వనరులు, సాంకేతికాంశాల్లో సహాయంపై అగ్రదేశాలు ఆంక్షలు విధించాయి. అయితే.. పర్యవసానాలను ముందుగానే పసిగట్టి.. వాజపేయి ప్రభుత్వం ప్రత్యామ్నాయ ప్రణాళికలు రూపొందించడంతో అగ్రరాజ్యాల ఆంక్షలేమీ చేయలేక పోయాయి.

లాహోర్ పర్యటన (ఫిబ్రవరి, 1999)
పాకిస్తాన్‌తో శాంతి కోసం ఆయన చేసిన ప్రయత్నం చరిత్రలో ప్రత్యేకాధ్యాయాన్ని లిఖించింది. ఢిల్లీ-లాహోర్ మధ్య బస్సు సర్వీసును 1999 ఫిబ్రవరిలో ప్రారంభించారు. తొలి బస్సులో అప్పటి ప్రధాని వాజ్‌పేయి ప్రయాణించారు. లాహోర్‌లోని మినార్-ఇ-పాకిస్థాన్‌ను సందర్శించారు. అక్కడి విజిటర్స్ బుక్‌లో పాకిస్థాన్ సార్వభౌమాధికారంతో సుసంపన్నమైన దేశంగా ఎదగాలని రాశారు. పాక్ సార్వభౌమాధికారం గురించి ప్రస్తావించిన తొలి భారత ప్రధాని ఆయనే.

ఆపరేషన్ విజయ్ (జూన్-జూలై 1999)
కశ్మీర్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనుకున్నారు. అయితే.. దాయాది దేశం తన వక్రబుద్ధిని మానుకోలేదు. బస్సు సర్వీసును ప్రారంభించిన మూడు నెలలకే మే-జులై మధ్యలో.. కార్గిల్‌ వద్ద కవ్వింపులకు దిగింది. పాకిస్తాన్‌ సైనికులు, కశ్మీరీ తీవ్రవాదులు వాస్తవాధీన రేఖను దాటి భారత్‌లోకి చొరబడే ప్రయత్నాన్ని .. సైనికులు సమర్థంగా తిప్పికొట్టారు. అణుబాంబులు కలిగివున్న దేశాల మధ్య జరిగిన రెండో యుద్ధంగా కార్గిల్‌ వార్‌ నిలిచింది.

విమానం హైజాక్ (డిసెంబరు 1999)
వాజ్‌పేయి హయాంలో ఎయిరిండియా విమానాన్ని పాక్ ఉగ్రవాదులు హైజాక్ చేశారు. ఫలితంగా భారత జైళ్లలో ఉన్న మౌలానా మసూద్ అజర్‌, ముస్తాక్ అహ్మద్ జర్గార్, ఒమర్ సయీద్‌లను వాజ్‌పేయి ప్రభుత్వం విడుదల చేయాల్సి వచ్చింది. ప్రయాణికులతో కఠ్మండు వెళ్తున్నవిమానాన్ని కాందహార్ తరలించిన ఉగ్రవాదులు తమ సహచరులను విడిపించుకున్నారు.

ఆగ్రా సమ్మిట్ (జూలై 2001)
అణ్వస్త్ర పరీక్షలతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో దానిని చల్లార్చేందుకు వాజ్‌పేయి-ముషారఫ్ ఆగ్రాలో రెండు రోజులపాటు భేటీ అయ్యారు. కశ్మీర్ వివాదం, సీమాంతర ఉగ్రవాదంపై చర్చించాల్సి ఉండగా, ఒక్క కశ్మీర్‌పైనే చర్చిస్తామంటూ ముషారఫ్ పట్టుబట్టారు. దీనికి భారత్ నిరాకరించింది. దీంతో ఈ చర్చలు అసంపూర్తిగా మిగిలాయి.

గుజరాత్ అల్లర్లు (డిసెంబరు 2002)
నరేంద్రమోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అల్లర్లు చెలరేగాయి. మోదీని తొలగించాలన్న డిమాండ్ గట్టిగా వినిపిస్తున్నప్పటికీ వాజ్‌పేయి మాత్రం మోదీకి మద్దతుగా నిలిచారు. మోదీ రాజధర్మాన్ని పాటించారంటూ ఆయనకు అండగా నిలిచారు. దీంతో వాజ్‌పేయిపైనా విమర్శలు వెల్లువెత్తాయి.

పార్లమెంటుపై దాడి (డిసెంబరు 2001)
లష్కరే తాయిబా, జైషే మహమ్మద్‌కు చెందిన ఐదుగురు ఉగ్రవాదులు పార్లమెంటుపై దాడికి తెగబడ్డారు. ఉగ్రవాదులు సహా 12 మంది మృతి చెందారు. దీనిని తీవ్రంగా పరిగణించిన వాజ్‌పేయి 5లక్షల బలగాలను సరిహద్దులో మోహరించారు. యుద్ధవిమానాలు, నౌకలు యుద్ధానికి సిద్ధమయ్యాయి. రెండు దేశాల మధ్య మరోమారు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. యుద్ధం తప్పదని అందరూ భావించారు. ఆరు నెలలపాటు సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అమెరికా జోక్యంతో వాతావరణం చల్లబడింది.

ముషారఫ్‌తో (2004)
ఇస్లామాబాద్‌లో జరిగిన సార్క్ సమావేశాల సందర్భంగా వాజ్‌పేయి-ముషారఫ్ భేటీ అయ్యారు. తమ గడ్డపై నుంచి భారత్‌పైకి ఉగ్రవాదులను అనుమతించబోని ఈ సందర్భంగా ముషారఫ్ హామీ ఇచ్చారు. ఈ చర్చలు కూడా మిశ్రమంగా ముగిశాయి.

Total Views: 87 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

వైసీపీలోకి జయప్రద?

ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రద వైసీపీలో చేరబోతున్నారా? త్వరలోనే